మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిత్వంపై జగపతిబాబు ప్రశంసలు
- తన తొలి సినిమాకు క్లాప్ కొట్టాలని కోరడానికి చిరంజీవి ఇంటికి వెళ్లామన్న జగపతిబాబు
- తనను, తన తండ్రిని చిరంజీవి ఆత్మీయంగా ఆహ్వానించారని వెల్లడి
- సినిమా ప్రారంభోత్సవానికి వచ్చి క్లాప్ కొట్టారన్న జగపతిబాబు
టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి గురించి పంచుకున్న కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. జగపతిబాబు హీరోగా పరిచయమైన తొలి సినిమా 'సింహ స్వప్నం'. ఆ సినిమా ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టాల్సిందిగా కోరడానికి జగపతిబాబు, ఆయన తండ్రి వీబీ రాజేంద్రప్రసాద్ కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లారట. అప్పట్లో చిరంజీవి గారు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా, స్టార్‌డమ్‌లో పీక్స్‌లో ఉన్నప్పటికీ.. వీరిని ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించారట. అంతేకాదు, జగపతిబాబును చూడగానే "చాలా అందంగా ఉన్నావు" అని మెచ్చుకుని, అడగడమే ఆలస్యం వెంటనే వచ్చి సినిమా ప్రారంభోత్సవానికి క్లాప్ కొట్టారని జగపతిబాబు గుర్తుచేసుకున్నారు.
ఇక ఆ సంఘటన జరిగిన దాదాపు 35 సంవత్సరాల తర్వాత, 'పెద్ది' సినిమాలో జగపతిబాబు పోషించిన పాత్రను చూసి చిరంజీవి మళ్లీ అదే స్థాయిలో ఫోన్ చేసి మరీ ప్రశంసించారట. చిరంజీవిలోని ఆ గొప్ప గుణాన్ని జగపతిబాబు ఈ ఇంటర్వ్యూలో ఎంతో సంతోషంగా పంచుకున్నారు. ఒకప్పుడు హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించిన జగపతిబాబు, ప్రస్తుతం వైవిధ్యమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, పవర్‌ఫుల్ విలన్‌గా తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్నారు.